పోటీ చేయనున్న తన్నీరు శ్రీనిత.. రమ్యారావు ఆసక్తికర పోస్ట్‌
హైదరాబాద్‌.. సీఎం కేసీఆర్‌ అన్న కూతురు, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్‌. రమ్యారావు ఆదివారం తమ పార్టీకి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో ‘తాజా తెలంగాణ’ పేరుతో ఒక ఆసక్తికరమైన పోస్టు చేశారు. ‘‘మరో 4 నెలల్లో సిద్దిపేటకు బై ఎలక్షన్‌. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న తన్నీరు శ్రీనిత’’అని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గానికి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక తన్నీరు శ్రీనిత.. హరీశ్‌రావు సతీమణి. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌ నాయకురాలు రమ్యారావు మేనత్త కొడుకుల్లో హరీశ్‌ ఒకరు. దీంతో ఆమె తమ పార్టీ వాట్సాప్‌ గ్రూపులో చేసిన పోస్టుకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం కేసీఆర్‌.. హరీశ్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా టీఆర్‌ఎస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయిస్తారనే ప్రచారానికి ఆస్కారం ఏర్పడింది.