★ సీఎం కేసీఆర్, ఉద్యోగుల కృషివల్లే ఇది సాధ్యమైంది
★ పవర్ ఇంజినీర్స్ డైరీ ఆవిష్కరణలో ట్రాన్స్‌కో,
జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
★ వచ్చేనెలతో 50 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకోనున్న సీఎండీ

విద్యుత్‌రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని, సీఎం కేసీఆర్ కార్యదక్షత, ఉద్యోగుల నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమైందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం సోమాజిగూడలోని విద్యుత్ ఇంజినీర్స్‌భవన్‌లో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ పవర్ ఇంజినీర్స్ డైరీ-2019ని ఆవిష్కరించి మాట్లాడారు.ట్రాన్స్‌మిషన్ నష్టాలను 2.88 శాతానికి తగ్గించి, ట్రాన్స్‌మిషన్ విద్యుత్ సామర్థ్యాన్ని 99.9 శాతానికి పెంచామన్నారు. ట్రాన్స్‌కో డిస్ట్రిబ్యూషన్ రంగంలో రూ.22 వేల కోట్లు పెట్టుబడులు పెట్టామని వివరించారు. త్వరలోనే విద్యుత్ ఉద్యోగులు, జెన్‌కో సిబ్బందికి ప్రోత్సాహకం అందిస్తామన్నారు. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పీ రత్నాకర్‌రావు, పీ సదానందం మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని మిగులు విద్యుత్‌గా మార్చడంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో సీఎండీ ప్రభాకర్‌రావు కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్‌ఎన్పీడీసీఎల్ సీఎండీ ఏ గోపాల్‌రావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, అసోసియేషన్ ప్రతినిధులు బీ మంగీలాల్, కిరణ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, భాస్కర్, సురేశ్, ప్రశాంత్, సంతోష్, వెంకటనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

అవిశ్రాంతంగా ప్రభాకర్‌రావు సేవలు

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు విద్యుత్ రంగం సర్వీస్‌లోకొచ్చి వచ్చేనెలతో 50 ఏండ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఇయర్‌గా పేర్కొంటూ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 కిలోల కేక్‌ను కట్‌చేశారు. 1969 ఫిబ్రవరి 10న సంస్థలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా నేరుగా నియామకమయ్యారు. అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా.. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభాకర్‌రావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యుత్ సంస్థల్లో విశిష్ట సేవలను అందిస్తూ రాష్ట్రం అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచేలా చేశారని అసోసియేషన్ ప్రతినిధులు కొనియాడారు. 50 ఏండ్లపాటు విద్యుత్‌రంగంలో అందించిన సేవలు అందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు.

విద్యుత్‌రంగంలో అర్ధ శతాబ్దకాలంగా సేవలందిస్తున్న ప్రభాకర్‌రావు అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఎకనామిక్ టైమ్స్, సీబీఐపీ, స్కోచ్, 2016లో బూర్గుల రామకృష్ణారావు అవార్డులను అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్‌ఈబీకి ఒక బిలియన్ యూఎస్ డాలర్ల రుణం మంజూరులో భాగంగా అమెరికాలోని ప్రపంచ బ్యాంకుకు వెళ్లిన దేశ ప్రతినిధుల బృందంలో సభ్యుడిగా ఉన్నారు.