సింధుకు రజతం..-బిజ్ ఈ న్యూస్


-ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో మారిన్
-చేతిలో ఓటమి
-మూడోస్వర్ణంతో మెరిసిన మారిన్.

బిజ్ ఈ న్యూస్ :ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత షట్లర్ ఎవరూ స్వర్ణం నెగ్గిన చరిత్ర లేదు..ప్రపంచకప్‌లో పతకాలైతే సాధించారు గానీ..బంగారువెలితి మాత్రం తీరడంలేదు.. కెరీర్‌లో వరుసగా రెండోసారి ప్రపంచకప్‌లో ఫైనల్ చేరి పసిడి ఆశలు పెంచినా సింధు మరోసారి నిరాశనే మిగిల్చింది. రియో ఒలింపిక్స్‌లో కరోలిన్ మారిన్ ధాటికి వెండిపతకమే దక్కగా.. ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్లోనూ సింధు ..అదే మారిన్ చేతిలో ఓటమితో రజతమే దక్కించుకుంది. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత షట్లర్‌గా నిలవాలన్న సింధు కల నెరవేరలేదు.. వరుసగా దిగ్విజయాలతో ఫైనల్ చేరినా..మారిన్ అడ్డంకిని అధిగమించలేక సింధు చేతులెత్తేసినా.. ప్రపంచకప్‌లో నాలుగోపతకంతో అదరగొట్టింది..

ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో మరోసారి ఓడిపోవడం నిరాశను కలిగిస్తున్నది. గత టోర్నీలోనూ నేను ఫైనల్లో ఓడాను. మరోసారి ఈ పరాజయాన్ని పునరావృతం చేయకూడదని అనుకుంటున్నా. పూర్తిస్థాయి సన్నద్ధతతో ప్రపంచకప్ బ్యాడ్మింటన్ టోర్నీలో బంగారు పతకం లక్ష్యంగా ఆటను మెరుగుపరుచుకుంటాను. వచ్చే టోర్నీలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఆటలో గెలుపు ఓటములు సహజమే. ఫైనల్లో ఓడిపోవడం విచారం కలిగిస్తున్నా.. ఫైనల్ చేరడం ఆనందంగా ఉంది. ఈరోజు నాది కాదు. ఎత్తుపల్లాలు జీవితంలో మరింత రాటుదేలేందుకు సహకరిస్తాయి – సింధు

నాంజింగ్(చైనా): ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత టాప్ షట్లర్‌కు పీవీ సింధుకు మరోసారి నిరాశ.. టోర్నీ ఆరంభం నుంచి అద్భుతమైన ఆటతీరుతో దూసుకువచ్చిన సింధు మరోసారి ఆఖరిమెట్టుపై చతికిలపడింది. క్వార్టర్స్‌లోనూ, సెమీస్‌లోనూ వరుసగా కఠినమైన ప్రత్యర్థులతో పోరాడి గెలిచి ఫైనల్ చేరిన సింధు ఈసారి పసిడిఆశలను మరింతగా పెంచినా స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌ను నిలువరించడంలో విఫలమైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో మారిన్ 21-19,21-10 స్కోరుతో వరుసగేముల్లో సింధును ఓడించి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడో స్వర్ణం గెలుచుకుంది. రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరినా ఓటమితో సింధు మరోసారి రన్నరప్‌గా సంతృప్తి చెందింది. తొలిగేమ్‌లో హోరాహోరీగా పోరాడినా.. రెండోగేమ్‌లో మాత్రం పట్టువిడిచిన సింధు సునాయాసంగా ఓడి రెండోసారి రజతం సాధించింది. గతంలో రెండుసార్లు కాంస్యం, రజతం సాధించిన సింధు ..మారిన్ చేతిలో ఓడి మరోమారు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్ స్థానంతో సంతృప్తి చెందింది.

sindhu2

ఆరంభంలో అదరగొట్టినా..

కీలకమైన ఫైనల్..ప్రత్యర్థి మారిన్‌ను గెలువగలననే ఆత్మవిశ్వాసంతో సింధు తుదిపోరుకు సిద్ధమైంది. ఆరంభంలో సింధు జోరుగా ఆటను ప్రారంభించింది. 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సింధు ..స్పెయిన్ అమ్మాయి కరోలినా మారిన్ వేగాన్ని తట్టుకుంటూ సుదీర్ఘర్యాలీలు ఆడుతూ పుంజుకునే ప్రయత్నం చేసింది. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరిస్తూ 6-4తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ఈదశలో వేగంగా ఆడి స్కోరు సమం చేసేందుకు ప్రయత్నించిన మారిన్ షాట్లు గతితప్పాయి. ఔట్ లైన్ సమీపంలో షాట్లు ఆడగా అవన్నీ ఔట్ కావడంతో సింధు 11-8తో ఆధిక్యం పెంచుకుంది. విరామం తర్వాత మారిన్ మూడుసార్లు అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో షటిల్‌ను బయటకు పంపడంలో 15-11తో సింధు పైచేయిని ప్రదర్శించింది. ఈ దశలో తనదైన వేగం, దూకుడుతో మారిన్ షటిల్‌ను నియంత్రిస్తూ అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. వరుసగా పాయింట్లు సాధిస్తూ 15-15తో స్కోరు సమం చేసింది. నెట్ ప్లేస్‌మెంట్స్ కొట్టడంలో సింధు తడబడడంతో మారిన్‌కు పాయింట్లు లభించాయి. వరుసగా పాయింట్లు సాధిస్తూ 17-17తో స్కోరు సమంగా ఉన్నదశలో మారిన్ కొట్టిన షాట్ కోర్టు వెలుపలికి వెళ్లడంతో సింధు 18-17తో మరోసారి ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో సింధు గేమ్ గెలిచే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈదశలో మారిన్ కొట్టిన స్మాష్‌ను సింధు కోర్టు బయటకు కొట్టడంతో మారిన్ గెలుపునకు దగ్గరైంది. చివరలో సింధు పోరాడినా ..వేగవంతమైన స్మాష్‌లతో దూకుడుగా ఆడిన మారిన్ 21-19తో తొలిగేమ్ సొంతం చేసుకుంది.

marin

ఆకాశమే హద్దుగా..

రెండోగేమ్‌లో కరోలినా మారిన్ పూర్తిస్థాయిలో చెలరేగడంతో సింధుకు ఏమాత్రం అవకాశం లభించలేదు. తొలిగేమ్ ఓడిన నిర్వేదం..నిరుత్సాహంలో సింధు పూర్తిగా ఒత్తిడిలో పడింది. 5-0తో తిరుగులేని రీతిలో దూసుకెళ్లిన మారిన్..విరామానికి 11-2తో పూర్తిస్థాయి ఆధిక్యం అందుకుంది. విరామం తర్వాత కూడా మారిన్ దూకుడు కనబరిచి పూర్తిస్థాయి ఆధిపత్యంతో చెలరేగింది. వరుసగా షటిల్‌ను నెట్‌కు కొడుతూ సింధు పాయింట్లు చేజార్చుకుంది. దీంతో రెండోగేమ్‌లో 21-10 స్కోరుతో తిరుగులేని ఆధిపత్యంతో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. సింధుపై తిరుగులేని విజయంతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మూడో స్వర్ణంతో మురిసింది. కాగా, సింధు మరోసారి ఫైనల్లో ఓడి రజతంతో సంతృప్తి పడింది.

8

2016 నుంచి మేజర్ టోర్నీ ఫైనల్స్‌లో సింధుకు ఇది ఎనిమిదో ఓటమి.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *