హైదరాబాద్ ప్రతినిధి:- హై టిఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి సారించింది. గ్రామ పంచాయితీ ఎన్నికలు పూర్తి కావడంతో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసి తిరుగులేని రాజకీయ శక్తిగా పార్టీని మలిచేవిధంగా పార్టీ అధిష్టానం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి నిర్వహించే సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదును పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి చేసి పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఫిబ్రవరిలో ఎట్టిపరిస్థితుల్లో సభ్యత్వనమోదు ప్రక్రియ ప్రారంభించాలనే ఆలోచన ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల కారణంగా జాప్యం జరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెటిఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలుత జనవరిలో పార్టీ శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించాలని భావించినా పంచాయితీ ఎన్నికల కారణంగా నిర్వహించలేకపోయారు. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరిలో సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ ప్రారంభం కావాల్సి ఉన్నా పార్లమెంట్ ఎన్నికల కారణంగా వాయిదాపడింది. గత ప్లీనరీ సందర్భంగా నిర్వహించిన సభ్యత్వ నమోదులో సుమారు 73 లక్షల సభ్యులను చేర్చినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈసారి కోటి సభ్యత్వాలను లక్షంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పార్టీ సభ్యులకు బీమా సదుపాయం ఉద్యమాలనుంచి రూపుదిద్దుకున్న టిఆర్‌ఎస్ పార్టీకి ఉన్న లక్షలాది మంది పార్టీ కార్యకర్తలకు బీమా సదుపాయం ఉంది. పార్టీ రూ. 3 కోట్ల ప్రీమియం కట్టి సభ్యులందరికీ బీమా వర్తింపచేసింది. ఇప్పటికే వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 303 మంది టిఆర్‌ఎస్ కార్యకర్తలకు పార్టీ బీమా పరిహారాన్ని అందజేసింది.
*
ఎంపి బూరకు కెటిఆర్ అభినందనలు.

హైదరాబాద్: డాక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి లాప్రోస్కోపిక్, స్థూలకాయం, జీర్ణాశయం వైద్యుడుగా రికార్డులు సొంతంచేసుకుని రాజకీయనాయకుడిగా స్థిరపడిన టిఆర్‌ఎస్. ఎంపి బూరనర్సయ్యగౌడ్ మరోసారి డాక్టర్‌గా సేవలందించారు. రోడ్డుప్రమాదంలో ప్రాణాపాయస్థితిలో ఉన్న నాగమణికి ప్రాథమిక చికిత్సచేసి కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు శనివారం బురనర్సయ్యగౌడ్‌ను అభినందిస్తూ గొప్ప స్పందన నర్సయ్య సాబ్ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కెటిఆర్ ట్విట్ చేయడంతో వందలాధి మంది స్పందిస్తూ నర్సయ్యగౌడ్‌కు అభినందనలు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్లితే నల్గొండ జిల్లాలో ఉంటున్న పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంకు చెందిన నాగరాజు, వెంకటేశ్వర్లు, నాగమణి బైక్ పై నాగమణి తండ్రి అంతక్రియలకు సొంత ఊరుకు వెళ్ల్లుతున్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం, ఇనుపాముల గ్రామం దగ్గర బైక్ అదుపుతప్పిముందు వెల్లుతున్న వాహనాన్ని డీకొట్టింది. నాగమణి చీర బైక్ చక్రంలో చిక్కుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగమణి కేకలు వేయడంతో ఆనేక మంది గుమికూడారే కానీ వైద్యసహాయం కోసం ఎవరూ ముందుకు రాలేదు. ఆదే మార్గంలో వెళ్ల్లుతున్న భువనగిరి ఎంపి. డాక్టర్. బూరనర్సయ్య గౌడ్ తక్షణం స్పందించి సంఘటనాస్థలంలో నాగమణికి ప్రాథమిక చికిత్స చేశారు. అలాగే ప్రమాదంలో గాయపడినవారికి సపర్యలు చేసి ఆంబులెన్స్ రప్పించి స్థానిక ఆసుపత్రికి తరలించడంతో నాగమణి ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డారు. ఈవిషయం తెలుసుకున్న టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బూరనర్సయ్య వైద్య సేవలను కొనియాడుతూ పోస్టు చేసి ప్రశంసించారు.