వాటికి పర్యవేక్షకుడి అనుమతి తప్పనిసరి
కోడ్‌ ఉల్లంఘన కిందకు పదవుల వేలం
ఉల్లంఘిస్తే ఆరేళ్లు అనర్హత.. ఏడాది జైలు

హైదరాబాద్‌, ఊర్లో ఎవరికి వారు వేలం వేసేసుకుని.. ‘మేం ఏకగ్రీవం’ అని ఏకపక్షంగా ప్రకటించుకుంటే ఇక కుదరదు! గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు పదవుల ఏకగ్రీవాలకు ఇకపై పర్యవేక్షకుడి అనుమతి తప్పనిసరి. ఆయన సంతృప్తి చెంది.. అనుమతిస్తేనే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి దశ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. సర్పంచ్‌, వార్డు పదవులను పలు చోట్ల వేలం వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఈసీ స్పందించింది. వేలం ద్వారా పదవులను ఏకగ్రీవం చేయడం నియమావళి (కోడ్‌)ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
పంచాయతీరాజ్‌ చట్టం 2018, సెక్షన్‌ 211(1)తో పాటు ఐపీసీ 171-బి, 171-ఈ నిబంధనల ప్రకారం దీన్ని ఎన్నికల మాల్‌ ప్రాక్టీస్‌గా పరిగణిస్తామని తెలిపింది. వేలం ద్వారా పదవిని చేజిక్కించుకున్నట్లు గుర్తిస్తే.. సదరు నాయకుడిని అనర్హుడిగా ప్రకటించడంతోపాటు ఆరేళ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తారు. ఏడాది జైలుశిక్ష కూడా విధిస్తారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. పదవుల వేలంపై పత్రికలు, ఇతర మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై విచారణ జరపాలని, వేలంలో పాల్గొన్న వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ఆదేశించింది.

ఎన్నికల సిబ్బందికి సెలవులు రద్దు

ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బందికి ఎస్‌ఈసీ సెలవులు రద్దు చేసింది. ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పర్వదినాలు, ఇతర సెలవు రోజుల్లోనూ వారు విధులు నిర్వహించాలని ఆదేశించింది.