వచ్చే ఏడాది స్వర్ణమే లక్ష్యం-బిజ్ ఈ న్యూస్


హైదరాబాద్, బిజ్ ఈ న్యూస్: ప్రపంచకప్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడమే ధ్యేయమని, వచ్చే ఏడాది జరిగే టోర్నీలో లోపాలను సరిచేసుకుని విజయం సాధిస్తానని భారత సూపర్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. చైనాలోని నాంజింగ్‌లో ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో రజతం సాధించి స్వదేశానికి చేరుకున్న సింధు ఉల్లాసంగా కనిపించింది. ఏదైనా టోర్నీలో ఫైనల్ చేరడమంటే మాటలు కాదని, ఫైనల్లో ఓడిపోవడం తనకు ఫోబియాగా ఏమీ మారలేదని మంగళవారం హైదరాబాద్, గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా సింధు వివరించింది. భారత చీఫ్‌కోచ్ గోపీచంద్‌తో కలిసి సమావేశంలో పాల్గొన్న సింధు వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.

తొలిగేమ్‌లో కరోలినా మారిన్‌కు గట్టిపోటీ ఇచ్చినా చిన్న చిన్న పొరపాట్లతో గేమ్ చేజార్చుకున్నానని చెప్పింది. వరుసగా మూడు గేముల్లో అగ్రశ్రేణి షట్లర్లతో తలపడాల్సి రావడంతోనే ఫైనల్ మ్యాచ్‌కు ముందు కాస్త అలసటగా ఉన్నా పోరాడినట్లు వివరించింది. ప్రతి ఒక్కరూ గెలిచేందుకే టోర్నీకి వస్తారని, అందునా ప్రపంచ చాంపియన్‌షిప్ అంటే అందరూ గట్టి ప్రత్యర్థులే ఉంటారని స్పష్టం చేసింది. ఫైనల్లో ఓడిపోయనని బాధలేదని, తన కెరీర్‌లో మరో పతకం చేరిందని సంతోషంగా ఉందని సింధు పేర్కొంది. మారిన్ ఎప్పుడూ దూకుడుగా ఆడుతుందన్న సింధు మైదానంలో మాత్రమే మేమిద్దరం ప్రత్యర్థులం కాగా, బయటమాత్రం మంచి స్నేహితులమని తేల్చింది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *