హైదరాబాద్ ప్రతినిధి:- భూముల వివరాలు పకడ్బందీ.
అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం.
ప్రభుత్వ భూముల రక్షణకు అధికారుల సన్నద్ధం. రాష్ట్రంలోని భూములను ఆన్‌లైన్ చేయాలన్న రెవెన్యూ శాఖ లక్షం త్వరలో సాకారం కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్, వక్ఫ్, భూదాన్, నిజాంతో పాటు ఇతర భూములను ఆన్‌లైన్ చేసి పకడ్భందీగా రికార్డుల తయారీ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోం ది. గతంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం లోపంతో అనేక భూములను కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. రికార్డుల్లోని లొసుగులు, నకిలీ పాస్‌పుస్తకాలతో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతో పాటు ప్రైవేటు భూములకు రక్షణ లేకుండా పోయింది. కొన్ని గ్రామాల్లో అసలు యజమానికి రికార్డుల్లో ఉన్న పేర్లకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉన్న వివరాలను భూ రికార్డుల ప్రక్షాళనతో సరిచేశారు. అనేక ప్రాంతాల్లో ఒకే పేరుతో అనేక ఖాతాలను రికార్డుల్లో పేరు మార్చకుండా ఉండిపోవడం, 1బి రికార్డుల్లో సమస్యను నివారించడంతో క్లిష్ట సమస్యలు తీరాయి. ఈనేపథ్యంలో రెవెన్యూ శాఖ పరిశీలనతో సంబంధం లేకుండా భూముల రిజిస్ట్రేషన్లు జరగకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అమల్లోకి తెస్తోంది. గతేడాది నుంచి స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో ఆధార్ కార్డుతో పాటు పాన్‌కార్డు వివరాలను నమోదు చేయ డం ప్రారంభించారు. తద్వారా యూఐడిఏ, ఇన్‌కంటాక్స్ సర్వర్‌తో సరిపోల్చుకున్న తరువాత వివరాలు సరిగ్గా ఉన్నాయని తేలాక రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

ప్లాట్లను రిజిస్ట్రేషన్‌చేయకుండా చట్టసవరణ…

అనుమతులు లేని లే ఔట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వదారా స్థానిక సంస్థలకు పన్నులతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోందని అధికార యంత్రాంగం భావిస్తోంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో లే ఔట్లకు అనుమతి లేకపోతే రిజిస్ట్రేషన్లు చేయవద్దని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దీనికి అనువుగా పురపాలక చట్టంలో సవరణ తెచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్‌తో పాటు సదరు భూమి రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో నిక్షిప్తం అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయం రికార్డుల్లో కనిపించేలా అధికార యం త్రాంగం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఈ విధానంతో అనేక అక్రమాలకు చెక్‌పడింది. ఇందుకు రెవెన్యూ రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌ఓఆర్) చట్టంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సవరణలు చేశారు. పట్టణాలు, మున్సిపాలిటీలు, పురపాలక, పట్టణ చట్టాల్లో సవరణలు చేసి అనుమతి ఉన్న లే ఔట్ల వివరాలను ప్రత్యేక వైబ్‌సైట్‌లో పొందుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివలన రిజిస్ట్రేషన్‌లకు సులువు అవుతుందని ప్రభుత్వం యోచిస్తోంది.

పురపాలక శాఖను కూడా అనుసంధానిస్తే…

తెలంగాణలోని అన్ని పురపాలక, నగర పాలక, నగర పంచాయతీలను రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానించాలన్న యోచనను ప్రభుత్వం తెరపైకి తీసుకువస్తోంది. రెవెన్యూ శాఖను రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం చేసినట్టుగా పురపాలక శాఖను కూడా అనుసంధానిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఆస్తిపన్ను వసూళ్లలో శాస్త్రీయతో పాటు ఆస్తిపన్ను పరిధిలోకి రాని నివాసాలను గుర్తించి రాబడి పెంచుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఆస్తి పన్ను, ప్రకటనల మధ్య ట్రేడ్ లైసెన్సులు రుసుములను వసూలు చేయడానికి మరింత పారదర్శకత వస్తుందని అధికారులు గుర్తించారు. ఈ విధానం అమలు చేస్తే 30 నుంచి 40 శాతం రాబడి పెరుగుతుందని ప్రభుత్వం చేసిన సర్వేలో వెల్లడయ్యింది.

పెరిగిన క్రయ, విక్రయాలు

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 13,92,334 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా 5,850 కోట్ల రూపాయలను స్టాంపులు రిజిస్ట్రేషన్‌శాఖ ఫిబ్రవరి చివరికి సాధించింది. మార్చి నెలాఖరుకు మరో రూ.600 కోట్ల రాబడి రావచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

అవి తప్పనిసరి

రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు ఆధార్‌కార్డు, పాన్‌కార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. రూ.50 వేలు దాటిన లావాదేవీలకు కచ్చితంగా పాన్‌కార్డును తీసుకుంటాం. ఆధార్‌కార్డును గుర్తింపుకార్డుగా పరిగణిస్తాం. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 5,700 కోట్ల రూపాయల గ్రాస్ ఆర్థిక సంవత్సరానికి సమకూరుతుందని భావించాం. కానీ అంచనాలకు మించి ఫిబ్రవరి నెలాఖరు నాటికి రూ.5,800ల ఆదాయం సమకూరింది.మార్చి నెలాఖరుకు మరో రూ.600 కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నాం.

-స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ చిరంజీవులు