హైద‌రాబాద్‌ ప్రతినిధి:- ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్‌ ఛార్జీ చెల్లించి ప్రయాణించే వాహనదారులకు కొంత ఉపశమనం లభించింది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు టోల్‌ ఛార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు. అంటే 20 కంటే ఎక్కువ వాహనాలు ఒకటే టోల్‌ వరుసలో ఉంటే.. టోల్‌ ఛార్జీ చెల్లించనవసరం లేదు. హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఈ నిబంధనను వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ నిబంధనను ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్‌ఎండీఏ.. టోల్‌ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే టోల్‌ ప్లాజాల పరిసరాల పరిశుభ్రత, భద్రతా చర్యలపై కూడా దృష్టి సారించింది. నిత్యం జాతీయ రహదారులపై 1.25 లక్షల వాహనాలు వెళుతున్నాయి. పండగలు, సెలవులు, వీక్ ఎండ్ వచ్చిందంటే ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా పండగలు, సెలవులు వస్తే టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. దీంతో గంటల కొద్దీ టోల్‌ ప్లాజాల వద్ద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనను అమలు చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఎప్పుడైనా సరే ఒక్కో టోల్‌ వరుసలో 20 కంటే ఎక్కువ వాహనాలు ఉంటే.. టోల్‌ ఛార్జీలు చెల్లించకుండానే అక్కడినుండి పంపించేలా చర్యలు తీసుకోవాలని కొత్త ఏజెన్సీ ఈగల్‌ ఇన్‌ఫ్రా సంస్థకు స్పష్టం చేశారు.