మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి ని మర్యాద పూర్వకంగా కలిసిన జాఫర్ ఘడ్ మండలంలో గెలుపొందిన గ్రామ సర్పంచులు.

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన జఫర్ ఘడ్ మండలంలోని గ్రామాలలో గెలుపొందిన నూతన సర్పంచులు మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి ని ఈరోజు మర్యాద పూర్వకంగా వరంగల్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గెలుపొందిన సర్పంచులను ఆయన అభినందించారు.

అభిమానంతో తనను కలవడానికి వచ్చిన కొత్త సర్పంచులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజలు ఏ నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి క్షణం పని చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ నిత్యం వారికి అందుబాటులో ఉండేందుకు ప్రయత్నించాలన్నారు.

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలని, వీటిపై అవగాహనా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు.

బహిరంగ మల, మూత్ర విసర్జన లేని ప్రాంతాలుగా మీ గ్రామాలను తీర్చిదిడ్డుకోవడంలో సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలన్నారు.

ప్రజల సంక్షేమం కోసం, గ్రామ అభివృద్ధి కోసం మీరు చేసే కృషిలో తాను ఎప్పుడూ వెన్నంటి ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. .

జఫర్ ఘడ్ మండలంలోని గర్మిల పల్లి, వెంకటాపూర్, ఉప్పుగల్, తమ్మలపల్లి- ఐ, ఓబుళాపుర్, తమ్మలపల్లి-జి, శాపల్లి, సూరారం, తీగారం, హిమ్మత్ నగర్, కోనాయచలం, రేగడి తండా, ఆళ్వార్ బండ తండా, లక్ష్మీ నాయక్ తండా గ్రామాల సర్పంచులు నేడు కడియం శ్రీహరి గారిని కలిసిన వారిలో ఉన్నారు.