దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలంలో శ్రీరామ నవమి అంగరంగ వైభవంగా జరుగుతోంది. కల్యాణాన్ని వీక్షించేందుకు రామాలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో స్వామివారి దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల తాకిడితో క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణమంతా రద్దీగా ఉంది. కొద్దిసేపట్లో జరగనున్న స్వామి వారి కల్యాణం కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

ఇదిలాఉండగా, కల్యాణ వేడుకను నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల సౌకర్యార్థం షామియానాలు, చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. శిల్ప కళాశోభితమైన కల్యాణ మండపాన్ని రంగురంగుల పూలమాలలతో అందంగా అలంకరించారు. సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలను, పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.