ప్రేమించి పెళ్ళి చేసుకొని ఏకగ్రీవ సర్పంచ్ కాబోతున్నది

దేేనికైనా అదృష్టం ఉండాలి. తినే మెతుకుపైన కూడా రాసి పెట్టి ఉండాలి అని పెద్దలు ఊకనే అనలేదు. ప్రేమను నమ్మి వచ్చిన అమ్మాయికి జాక్ పాట్ దక్కింది. ఏకంగా గ్రామ సర్పంచ్ పీఠం ఎక్కే అదృష్టం వచ్చింది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఆ గ్రామం ఎస్టీ సర్పంచ్ రిజర్వ్ అయ్యింది. ఆ గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేకపోవడంతో ఆ యువతిని అదృష్టం వరించింది.

జనగాం జిల్లా అంక్షాపూర్ గ్రామానికి చెందిన బానోతున సోమ్లా, లక్ష్మీల కూతురు లల్లి. గత సంవత్సరం వేములవాడ రాజన్న దర్శనానికి పోగా అక్కడ కోటగడ్డ గ్రామానికి చెందిన ననుబోతుల రాజ్ కుమార్ తో లల్లికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో గతేడాది మార్చి 23న పెళ్లి చేసుకున్నారు. ప్రియుడిని నమ్మి వచ్చి కోటగడ్డలో ఓ పూరి గుడిసెలో కాపురం పెట్టారు. ఇదే సమయంలో కోటగడ్డ నూతన పంచాయతీగా ఎన్నికై ఎస్టీ రిజర్వ్ అయ్యింది. ఆ గ్రామంలో ఎస్టీలు ఎవరూ లేరు. లల్లి మాత్రమే ఎస్టీ. దీంతో లల్లి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నిక కానుంది. గతంలో కోటగడ్డ లక్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది.