హైదరాబాద్‌: సిక్కుల గురువు సంత్‌ శ్రీగురుగోవింద్‌ సింగ్‌ జన్మదినం సందర్భంగా సిక్కులు పెద్ద సంఖ్యలో గౌలిగూడలోని గురుద్వారా సందర్శించుకొని ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ ర్యాలీని పురస్కరించుకొని గౌలిగూడలోని గురుద్వారా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ గురుద్వారా పరిసర ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. సెంట్రల్‌ గురుద్వారా సాహెబ్‌ నుంచి అశోక్‌బజార్‌, గురునానక్‌ మార్గ్‌, అఫ్జల్‌గంజ్‌ జంక్షన్‌, సిద్ధి అంబర్‌బజార్‌, మొహింజాహిమార్కెట్‌, జాంబాగ్‌, పుత్లీబౌలీ మీదుగా సాగే ఈ యాత్రలో సుమారు 2000లకు పైగా సిక్కులు పాల్గొనే అవకాశముంది.

ర్యాలీ సెంట్రల్‌ గురుద్వారా నుంచి ప్రారంభమైన సమయంలో అఫ్జల్‌గంజ్‌ నుంచి సీబీఎస్‌, శంకర్‌శేర్‌ హోటల్‌ వైపునకు వాహనాలను అనుమతించరు. శివాజీ బ్రిడ్జి జంక్షన్‌, ఎస్‌జే బ్రిడ్జి రోటరీ నుంచి సీబీఎస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
ర్యాలీ అఫ్జల్‌గంజ్‌ జంక్షన్‌ ప్రాంతానికి చేరినప్పుడు అఫ్జల్‌గంజ్‌ నుంచి సీబీఎస్‌ వెళ్లే వాహనాలను సెంట్రల్‌ లైబ్రరీ వైపునకు మళ్లిస్తారు.
ర్యాలీ ఎంజే మార్కెట్‌ను సమీపించినప్పుడు చాదర్‌ఘాట్‌ నుంచి రంగమహల్‌ వైపునకు వెళ్లే వాహనాలను సీబీఎస్‌ వైపునకు మళ్లిస్తారు.
ర్యాలీ అఫ్జల్‌గంజ్‌ ప్రాంతానికి చేరినప్పుడు సిటీ కాలేజ్‌, మదీనా నుంచి అఫ్జల్‌గంజ్‌ వైపునకు అనుమతించరు. ఆ సమయంలో వాహనదారులు నయాపూల్‌ నుంచి సాలార్‌జంగ్‌ మ్యూజియం ఎస్‌జే రోటరీ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది.
ర్యాలీ శాంతిఫైర్‌ వర్క్‌ను సమీపించినప్పుడు అఫ్జల్‌గంజ్‌ నుంచి ఎంజే మార్కెట్‌ వైపునకు వాహనాలను అనుమతించరు. ఫీల్‌ఖానా, తోప్‌ఖానా మీదుగా ఎంజే మార్కెట్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
ర్యాలీ జరుగుతున్న ప్రాంతాల్లో రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్‌ సిబ్బంది వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.