హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిళకు- టాలీవుడ్ హీరో ప్రభాస్‌‌కు సంబంధం ఉందని గత ఐదేళ్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారాలను సీరియస్‌గా తీసుకున్న షర్మిళ.. పార్టీ నేతలతో కలిసి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ సీపీ ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సోషల్‌మీడియాలో ఓ వర్గం దుష్ప్రచారం చేసిందని.. 2014 ఎన్నికల తర్వాత ఫిర్యాదు కూడా చేసిన విషయాన్ని షర్మిళ గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని విషప్రచారానికి వేగం పెంచారని.. తప్పును తప్పు ఎత్తిచూపడానికి చట్టప్రకారం ఈ ప్రచారం సృష్టిస్తున్నవారిపై, వారి వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరినట్లు ఆమె తెలిపారు.

ప్రభాస్‌ను నేనెప్పుడూ కలవలేదు..!

” ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధముందని తప్పుడు ప్రచారం చేస్తున్నారో.. ఆ వ్యక్తిని నా జీవితంలో నేనెప్పుడూ కలవలేదు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధమూ లేదు. ఇది నిజం. ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. పోనీ.. ఇలా దుష్ప్రచారం చేస్తున్నవారు ఇవన్నీ నిజమేనని ప్రమాణాలు చేసి చెప్పగలరా..?. పోనీ ఆ వ్యక్తిని కలిసినట్లు గానీ, మాట్లాడినట్లుగానీ రుజువులు, ఆధారాలు చూపించగలరా..?. పుకార్లు చూపించి వ్యక్తిత్వాన్ని చంపాలనుకోవడం దారుణం కాదా..?. నన్ను ప్రేమించే నా భర్త ఉన్నాడు.. నా మీద ఆధారపడ్డ నా పిల్లలున్నారు. నాతో పాటు మా కుటుంబం, మా శ్రేయోభిలాషులు అందర్నీ బాధపెట్టిన విషయమిది. పుకార్లు పుట్టించి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం ఎంత వరకు సబబు..? ఏమిటీ పైశాచిక ఆనందం.. ఎందుకింత నీచానికి దిగజారటం..? ఇలా పుకార్లు చేస్తఇంత దిగజారుడు తనం అవసరమా..? ఈ ప్రచారం వెనుక టీడీపీ హస్తముందని నేను అనుమానం లేకుండా ఆరోపణలు చేస్తున్నాను” అని వైఎస్ షర్మిళ చెప్పుకొచ్చారు.

నా దేవుడికి తెలుసు..!
” ఐదేళ్ల క్రితమే ఈ దుష్ప్రచారం మొదలైంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పుడు మళ్లీ తలెత్తింది. మళ్లీ మళ్లీ ఇలా దుష్ప్రచారం మొదలవ్వచ్చు. ఈ విషయాలపై నేను మాట్లాడకపోతే ఇదే నిజమని కొంతమంది అనుకునే ప్రమాదముంది. కనుక ఈ తప్పుడు ప్రచారాలను మూలాలతో సహా తొలగించాలనే ఉద్దేశ్యంతోనే ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. నేను ఒక భార్యగా, తల్లిగా, ఒక చెల్లిగా నా నైతికతను, నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గురించి నాకు, నా దేవుడికి తెలుసు. కానీ ఈ రోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గనుక మీ అందరి ముందుకొచ్చి చెబుతున్నాను” అని షర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు.
*
షర్మిళ ఆరోపణలపై టీడీపీ నేత స్పందన.

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిళపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆమె తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం షర్మిళ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నస్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిళపై సోషల్‌మీడియా ప్రచారానికి టీడీపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ఆరోపణలను ప్రోత్సహించరని అన్నారు. వ్యక్తిగత ఆరోపణలు ఏ పార్టీ వాళ్లు చేసినా ఖండించాల్సిందేనని అన్నారు. జగన్‌ను రాజకీయంగా విమర్శించాం గానీ.. షర్మిళను ఏనాడూ ప్రస్తావించలేదని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.