హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు చలిగాలుల ప్రభావం పెరగడంతో పాటు ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల తెలంగాణలో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 48 గంటల పాటు తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు పడిపోయే అవకాశం ఉందన్నారు.

గత వారం రోజులుగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తొలుత వర్షం, ఆ తర్వాత సాధారణం కన్నా కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 7 డిగ్రీలు, హైదరాబాద్‌లో 9 డిగ్రీలకు పడిపోయిందని వాతావరణ శాఖ డైరెక్టర్‌ తెలిపారు. రాబోయే నాలుగైదు రోజుల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.