నందిగామ ప్రతినిధి : కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం (55) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శిఖా చౌదరి అనే మహిళను కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. జయరాం హత్య కేసులో 4 పోలీసు బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నాయి. జయరామ్‌కు బంధువు, వ్యాపార భాగస్వామి అయిన శిఖా చౌదరిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్‌- విజయవాడ జాతీయరహదారి పక్కన కారులో జయరాం మృతదేహాన్ని గుర్తించారు. రోడ్డుమార్జిన్‌ దిగి ఉన్న ఆయన కారు(ఏపీ16ఈజీ 0620)లో గురువారం అర్ధరాత్రి మృతదేహం కనిపించింది. వాహనంలో ఒక్కరే ఉండటం, డ్రైవర్‌ లేకపోవటం, మృతదేహం పడి ఉన్న తీరును బట్టి హత్యగా భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.