బిజ్ ఈ న్యూస్ ప్రతినిధి :-టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. కోల్‌కతా పోలీసులు అతడిపై లైంగిక వేధింపుల అభియోగాల నమోదు చేశారు. అతడిపై నాన్‌ బెయిలబుల్‌ నేరాలతో కూడిన ఛార్జిషీట్‌ను అలీపోర్‌ పోలీసు కోర్టులో దాఖలు చేశారు. సెక్షన్‌ 498ఏ (వరకట్న వేధింపులు), 354ఏ (లైంగిక వేధింపులు) కింద కేసులు పెట్టారు. తన భార్య హసిన్‌ జహాన్‌తో షమీకి తీవ్ర విభేదాలున్న సంగతి తెలిసిందే. తన భర్తకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన స్ర్కీన్‌షాట్లను జహాన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. గతేడాది మార్చి 7న ఈ వ్యవహారాన్ని బహిరంగం చేసింది.

షమి సైతం తన భార్యపై ఘాటుగా స్పందించాడు. ఆమె తన కెరీర్‌ను నాశనం చేసేందుకే ఇలా ప్రవర్తిస్తోందని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో షమిపై జహాన్‌ వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, గృహహింస కేసులు పెట్టింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేసింది. విచారణకు దిగిన బిసిసిఐ అతడి సెంట్రల్‌ కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపేసింది. ఫిక్సింగ్‌ ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో కాంట్రాక్టును పునరుద్ధరించింది. అప్పట్నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. మానసిక వేధనతో కొన్నాళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్న షమి తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. కుటుంబ విభేదాల నుంచి దూరం జరిగాడు. ప్రశాంతంగా ఉంటూ తిరిగి తన ఫిట్‌నెస్‌ సాధించాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించి ప్రపంచకప్‌ జట్టులో పోటీకి నిలిచాడు. తాజా ఆసీస్‌ సిరీస్‌లోనూ నాలుగు మ్యాచుల్లో 5 వికెట్లు తీశాడు.