కపిల్‌దేవ్‌, ధోనీకే సాధ్యమైంది…మరి కోహ్లీ..-బిజ్ ఈ న్యూస్


లండన్‌, బిజ్ ఈ న్యూస్ : ఇప్పటి వరకూ భారత టెస్టు క్రికెట్‌ జట్టుకు సారథ్య బాధ్యతలు వహించిన ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో విజయాలను అందుకున్నారు. మరి ఇప్పుడు కోహ్లీ వంతు వచ్చింది. లార్డ్స్‌లో కోహ్లీ విజయాన్ని అందుకుంటాడా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లార్డ్స్ మైదానంలో విజయం సాధించి ఆ ఘనత సాధించిన మూడో సారథిగా కోహ్లీ మాజీ సారథుల సరసన నిలుస్తాడో లేదో చూడాలి.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన భారత్‌ కేవలం రెండింట్లోనే విజయాలు సాధించింది. 11 పరాజయాలు నమోదు చేసుకోగా… నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది. కపిల్‌ దేవ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో మాత్రమే భారత్‌ ఇప్పటి వరకు లార్డ్స్‌లో విజయాలు నమోదు చేసుకుంది. 1932లో మొదటిసారి సీకే నాయుడు సారథ్యంలో భారత్‌ లార్డ్స్‌లో తొలి టెస్టు ఆడింది. ఈ టెస్టులో భారత్‌ 158 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 1986లో కపిల్‌ దేవ్ సారథ్యంలో భారత్‌ లార్డ్స్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐదు వికెట్ల తేడాతో భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిచింది.

అనంతరం 2014లో మహేంద్ర సింగ్‌ ధోనీ నాయకత్వంలో భారత్‌ రెండో సారి లార్డ్స్‌లో గెలుపొందింది. కుక్‌ సారథ్యంలోని ఇంగ్లాండ్‌ 95 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మళ్లీ ఇన్నాళ్లకు విరాట్‌ కోహ్లీ నాయకత్వంలో భారత్‌ లార్డ్స్‌ మైదానంలో టెస్టు ఆడబోతోంది. గురువారం నుంచి ప్రారంభంకానున్న ఈ టెస్టులో కోహ్లీ సేన విజయం సాధిస్తుందో లేదో చూడాలి. కెప్టెన్‌గా కోహ్లీ ఈ మైదానంలో విజయం సాధించి కపిల్‌దేవ్‌, ధోనీ సరసన నిలుస్తాడో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *