హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.  కారు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.   రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కర్ణాటక బళ్లారి జిల్లా గంగావతి పట్టణానికి చెందిన దంపతులు వెంకటేశ్వరరావు(60), సుబ్బలక్ష్మి(55), డ్రైవర్ శివలుగా గుర్తించారు. ఏలూరులో చికిత్స చేయించుకుని గంగావతికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.  శంషాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఓ కారు రావిరాల ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లో రోగిని ఏలూరు నుంచి హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు  మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతుదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.