ఈవీఎంలపై ప్రతిపక్షాలు శుక్రవారం మధ్యాహ్నం సమావేశం కానున్నాయి. దాదాపు 23 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని, భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించనున్నారు.
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, లోక్‌ తాంత్రిక్‌ జనతాదళ్‌ నేత శరద్‌ యాదవ్‌తో పాటు ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, జేఎంఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌, రాష్ట్రీయ లోక్‌ దళ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సహా దాదాపు 23 పార్టీల ప్రతినిధులు పాల్గొననున్నారు.
మళ్లీ బ్యాలెట్‌ పేపర్‌ను ప్రవేశపెట్టాలని కొన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తుండగా, వీవీపాట్‌లను పూర్తిగా లేదా 50 శాతమైనా లెక్కించాలని మరి కొన్ని పార్టీలు కోరనున్నాయి. ఈవీఎంల అం శం తర్వాత రాఫెల్‌ స్కాం కూడా సమావేశంలో ప్రస్తావనకు రానున్నట్లు తెలిసింది. సమావేశం అనంతరం వివిధ పార్టీల ప్రతినిధులు రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోడాను కలుసుకోవాలని భావిస్తున్నారు. గురువారం అఖిలపక్ష ప్రతినిధులు కాంగ్రెస్‌ కార్యాలయంలో సమావేశమై ఈవీఎంలపై తమ డిమాండ్లు, ముసాయిదా పత్రంపై చర్చించారు.