ఆసియాడ్‌కు 572 మంది అథ్లెట్లు..-బిజ్ ఈ న్యూస్


  • బాధ్యతాయుతంగా మెలగండి
  • భారత బృందానికి క్రీడామంత్రి రాథోడ్‌ సూచన
న్యూఢిల్లీ, బిజ్ ఈ న్యూస్ : ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టుపై సస్పెన్స్‌ వీడింది. మొత్తం 572 మంది అథ్లెట్ల బృందానికి కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) ఏర్పాటుచేసిన ఆసియాడ్‌ బృందానికి వీడ్కోలు కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ అథ్లెట్ల వివరాలు ప్రకటించారు. అథ్లెట్లు, అధికారులతో కలిపి మొత్తం 800కు పైగా భారత బృందం ఆసియాడ్‌లో పాల్గొంటుందని మంత్రి వెల్లడించారు. ఆసియా క్రీడలు ఈనెల 18 నుంచి వచ్చేనెల 2 వరకు ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి రాథోడ్‌ మాట్లాడుతూ.. క్రీడాగ్రామం లోపల, వెలుపల బాధ్యతాయుతంగా మసలుకోవాలని అథ్లెట్లకు సూచించారు. కామన్వెల్త్‌ క్రీడల సందర్భంగా మన అథ్లెట్లు బసచేసిన క్రీడాగ్రామం దగ్గర సిరంజిలు కనిపించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని, అథ్లెట్లంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు. ‘ఈ క్రీడల్లో మీరు దేశం తరఫున పాల్గొంటున్నారన్న సంగతి మర్చిపోవద్దు. క్రీడాగ్రామంలో కానీ, వెలుపల కానీ మీరు ప్రవర్తించే విధానం భారత్‌ అనే పేరుమీద ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ మెగా ఈవెంట్‌లో సత్తాచాటేందుకు ఎన్నోరోజులుగా కష్టపడ్డారు. ఇప్పుడు మీ కలలను సాకారం చేసుకునే అవకాశం వచ్చింది. అథ్లెట్లందరికీ శుభాభినందనలు. పతకాలతో తిరిగిరావాలని కోరుకుంటున్నాను’ అని రాథోడ్‌ ఆకాంక్షించారు.
ఆ ఇద్దరు సొంత ఖర్చులతో..: ఆసియాడ్‌లో భారత అథ్లెట్ల బృందంలో చెఫ్‌ డి మిషన్‌గా బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ను అతని డిప్యూటీగా రాజ్‌కుమార్‌ సచేటిని ఎంపిక చేయడంపై క్రీడాశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐవోఏ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ ఇద్దరూ తమ సొంత ఖర్చులతో అక్కడికి వెళుతున్నట్టు ప్రకటించింది. అంటే, భారత జట్టు వెంట వాళ్లున్నప్పటికీ, ఆ ఇద్దరు తమ ఖర్చులను వాళ్లే భరిస్తారని వెల్లడించింది. 2010 ఢిల్లీ కామన్వెల్త్‌ క్రీడల కుంభకో ణం కేసులో ఈ ఇద్దరిపై ఆరోపణలున్న నేపథ్యంలో వీళ్లను ఆసియాడ్‌ కు ఐవోఏ ఎంపికచేయడాన్ని క్రీడాశాఖ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *