హైదరాబాద్ ప్రతినిధి:-ఇప్పటికే దేశ వ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి. మరో నెల రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీ తన కసరత్తును మొదలు పెట్టింది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకే సారి జరగనున్నాయి. దీంతో వైసిపి, టిడిపి, కాంగ్రెస్, జనసేన మధ్య చాలా గట్టి పోటి ఏర్పడింది. వైసిపి, టిడిపి మధ్యనే చాలా గట్టిపోరు సాగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో వైసిపికి టిఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టిఆర్ఎస్ అధికార ప్రతినిధి తెలపడంతో దీని పై అందరిలో చర్చ ప్రారంభమైంది.త్వరలో జరగబోయే ఏపి శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో వైసిపికి తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని టిఆర్ఎస్ అధికార ప్రతినిధి అభిద్ రసూల్ ఖాన్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా జగన్ కే ఓటేయాలని తమ పార్టీ కోరనుందని ఆయన తెలిపారు. లోక్ సభ ఎన్నికల తర్వాత లౌకిక వాద, ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. వైఎస్ జగన్ లౌకిక వాది ,పేద ప్రజల స్నేహితుడు అని అన్నారు. ఆంధ్రాలో నివాసం ఉంటున్న తెలంగాణ ప్రజలు, బంధువులు, వ్యాపార భాగస్వాములంతా వైసిపికి ఓటేయాలని కోరుతామన్నారు. లోక్ సభ,శాసన సభ ఎన్నికల్లో వైసిపి భారీ మెజార్టీతో గెలుస్తుందని రసూల్ ఆశాభావం వ్యక్తం చేశారు.