హైదరాబాద్ ప్రతినిధి :- కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ముగిసింది. మే నెలాఖరు వరకు ఇరు రాష్ట్రాలకు నదీ జలాల విడుదలకు సంబంధించి చర్చించేందుకు గురువారం కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశమైంది. తెలంగాణకు 29, ఎపికి 17.5 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే ఎపి తమకు మే నెలాఖరు నాటికి 17 టీఎంసీల నీరు కావాలని కోరింది. అలాగే తెలంగాణ కూడా తమకు గతంలో కేటాయించిన నీరు వాడుకోలేదని, ఎపి ఎక్కువగా వాడుకుందని గతంలోనే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నదీ జలాలను ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు. ఈ మేరకు బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌ ఆర్కే జైన్‌ నీటివిడుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ భేటీలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ ఆర్కే జైన్‌, సభ్య కార్యదర్శి హరికేశ్‌ మీనా, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.