అక్క కోసం తమ్ముడి అన్వేషణ.. తొమ్మిదేళ్ల తర్వాత చేదు నిజం..-బిజ్ ఈ న్యూస్


హైదరాబాద్‌, బిజ్ ఈ న్యూస్ : తొమ్మిదేళ్ల క్రితం అదృశ్యమైన అక్క తాలుకు చేదు నిజాన్ని, అక్కకు పుట్టిన పిల్లల ఆచూకీని ఫేస్‌బుక్‌ సహాయంతో గుర్తించాడు ఓ యువకుడు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామం నుంచి బదుకుతెరువు కోసం ఓ కుటుంబం నగరానికి వలస వచ్చింది. ఆ కుటుంబంలో ఉపేంద్రాచారి అనే యువకుడితో పాటు అతని అక్క ప్రియ, తల్లి, మూగ చెవిటి సోదరుడితో కలిసి ఎల్‌బీ నగర్‌లోని మజీద్‌గాలిలో ఉండేవారు. ఉపేంద్రాచారి వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వారి ఇంటికి సమీపంలోనే మోరే హనుమంతు అనే క్యాబ్‌ డ్రైవర్‌ ప్రియకు మాయ మాటలు చెప్పి తరువాత ఎక్కడికో తీసుకు వెళ్లాడు. ఈ విషయం తెలియని ఉపేంద్రాచారి 2009 సంవత్సరం నుంచి అక్క ప్రియను అనేక చోట్ల వెదికినా ఫలితం లేకపోయింది. మూడేళ్ల క్రితం హనుమంతుతో వెళ్లిందని ఉపేంద్రాచారికి తెలిసింది.
చివరకు ఫేస్‌బుక్‌లో వెతకగా హనుమంతు పేరుతో ఎకౌంట్‌ కనిపించింది. అందులో హనుమంతు ఫొటోతో పాటు ఉపేంద్రాచారి సోదరి ప్రియ, ఆమె పిల్లల ఫొటోలు కనిపించాయి. అంతే ఆరా తీయడం మొదలెట్టాడు. హనుమంతు ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఉన్న అతని సాటి క్యాబ్‌ డ్రైౖవర్‌ల ఫోన్‌నంబర్లు సేకరించాడు. అతని కృషి ఫలించి ఒక డ్రైవర్‌ హనుమంతు ఫోన్‌ నెంబర్‌ ఇవ్వడంతో ఆయన హనుమంతు అడ్రస్‌ను కనుగొన్నాడు. తీరా అక్కడి వెళితే అక్కడ హనుమంతుతో పాటు వేరే యువతి ఉంది. అక్క ప్రియ కానీ, ఆమె పిల్లలు కానీ కనిపించలేదు. పట్టు వదలని ఉపేంద్రాచారి ఇరుగుపొరుగు వారితో మాట్లాడి అక్కడ జరిగిన సంగతి తెలుసుకుని హతాశుడయ్యాడు. అక్కడి వాళు తెలిపిన మేరకు అతను మూడు సంవత్సరాల క్రితం ఓ యువతిని కర్నాటక నుంచి తీసుకువచ్చాడని, ఆ తర్వాత అతని భార్యా, పిల్లలు మాయమయ్యారు.
అనంతరం ఉపేంద్రాచారి, పనిమీద హైదరాబాద్‌ వచ్చిన హనుమంతుని నిలదీయగా పొంతనలేని సమాధానాలిచ్చాడు. లోతుగా పరిశోధించగా ప్రియను భర్తే హత్య చేశాడని తెలిసింది. పిల్లలను కూడా ఇతరులకు అమ్మివేసినట్లు తెలుసుకున్నాడు. వెంటనే ఎల్‌బీ నగర్‌ పోలీసుల సలహాతో మర్రిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉపేంద్రా చారి ఫిర్యాదు మేరకు మోరె హనుమంతును అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన భార్య ప్రియను చంపి బావిలో పడేశానని తెలిపాడు. కొడుకును కొండమల్లేపల్లిలో, కూతురిని హైదరాబాద్‌లో అమ్మి మరో పెళ్లి చేసుకున్నట్టు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పిల్లల కోసం మల్లేపల్లికి, హైదరాబాద్‌కు మర్రిగూడెం నుంచి పోలీసు బృందాలు బయలు దేరాయి. ప్రియ అస్థిపంజరాన్ని బావిలోంచి తీయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. హనుమంతును కఠినంగా శిక్షించాలని ఉపేంద్రాచారి కోరుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *